25/12/2021
కాకినాడ సినిమా వీధి
హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు కాకినాడలో భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్లో మెయిన్ రోడ్కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆ చివరివరకూ దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే – దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి.
కాకినాడ లో ఉన్న స్పెషల్ గురించి వినే ఉంటారు. కోటయ్య కాజాలు, సుబ్బయ్య హొటెల్ కాదండీ. ఎప్పుడూ తిండి ధ్యాసేనా. కళా పోషణ గురించి. అలా అని మరీ సూర్య కళా మందిరం అవీ కాదు. సినిమా స్పెషల్. తెలుగు వారికీ సినిమాలకి ఉన్న సంబంధం మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఒక వీధి మొత్తం వరుసగా సినిమా హాళ్ళు ఉండేవన్న మాట. దానినే సినిమా వీధి అంటారు. దానికి సమాంతరంగా మైన్ రోడ్డు. దానికి సమాంతరంగా దేవాలయం వీధి. దేవాలయం వీధిలో వరుసగా అనేక దేవాలయాలుంటాయి.
మొదట్లో సినిమా వీధిలో మాత్రమే సినిమా హాల్స్ ఉండేవి. ఆ తరువాత మెయిన్ రోడ్ మీదా, మిగిలిన ఏరియాలలో కూడా కొన్ని సినిమా హాల్స్ వచ్చాయి లెండి. మైన్ రోడ్ లో తిరుమలా టాకీసు అని, ఆనంద్ - గీత్ - సంగీత్ - అంజనీ, పద్మ ప్రియ , శ్రీ ప్రియా , ఇంకా ఇప్పుడు కొత్తగా ఐనాక్స్ లు వచ్చాయి.
నేను చెప్పేది మా బాల్యం, స్కూల్, కాలేజీ రోజులు 1958-1975 మధ్య పీరియడ్ గురించి.
పండగ రోజుల్లో, శలవుల్లో ఇంటికి ఎవరైనా వస్తే జగన్నాధ పురం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్న సినిమా హాల్స్ లో ఏదో ఒక దాంట్లో టికెట్ దొరక్కపోదు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మా ఊరికి మాత్రమే ప్రత్యేకమయిన సినిమా వీధిలో ఉన్న థియేటర్ల గురించి.
ముందు జగన్నాధపురం వంతెన దగ్గర నుంచి బయల్దేరదాం. వంతెన దాటేసారుగా ఆ ఇప్పుడు కుడి చేతి వైపు తిరగండి. పదండి ఆ రోడ్లోకి. పోలీస్ స్టేషన్, BSNL ఆఫీసు దాటేసి ఎడం చేతి వైపు కనిపించే రోడ్డు మొదట్లో ఆగండి. రోడ్డు కనిపించిందా? అద్గదీ అదే మా ఊరి సినిమా హాల్ స్ట్రీట్ అన్నమాట.
అదిగో మొట్టమొదటిగా కుడిచేతి వైపు కనిపిస్తోందే, అదే స్వప్న థియేటర్. పెద్ద గేటు దాటుకు ముందుకి వెళ్తే లోపల గుబురుగా ఉన్న వెదురు పొద దాని చుట్టూ సిమెంట్ బెంచీలు. అందులోనే మేము 1972 లో బడి పంతులు సినిమా చూసేము. మంచి థియేటర్. ఇప్పుడు మూత బడినట్లుంది.
మరికొంత ముందుకెళ్ళి ఎడం చేతి వైపు చూడండి అక్కడో థియేటర్ ఉంది. ఎక్కడుందీ అని వెతుకుతున్నారా? లోపలెక్కడో ఉంటుంది. ఆ థియేటర్ పేరు ప్యాలెస్. పాండురంగ మహాత్మ్యం 1957 , ఇంటి గుట్టు 1958 లు శతదినోత్సవాలు జరుపుకున్నాయి ఇందులో. ఇప్పుడు ఈ థియేటర్లో సినిమాలు వేయడం లేదనుకుంటాను.
అదిగో ఆ కుడిపక్క ఇంకో థియేటర్ ఉంది కదా అదే లక్ష్మి థియేటర్. అగ్గి రాముడు 1954, జయం మనదే 1956, మంచి మనసుకు మంచి రోజులు 1958, రక్త సంబంధం 1962, లవ కుశ 1963, తోడు నీడ 1965 (92 రోజులు), వీరాభిమన్యు 1965, సర్కస్ రాముడు 1980, గజ దొంగ 1981 లలో ఇక్కడ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. చరిత్ర సాధించిన లవ కుశ సినిమా లక్ష్మీ టాకీసు అంటే గుర్తుకు వచ్చే సినిమా. రీ మోడల్ చేసారట. కొత్త సినిమాలు వేస్తున్నారు.
ఆ కుడిచేతి వైపు పొడుగాటి వీధిలా ఉన్న థియేటర్ కనబడిందా? అది మా కాకినాడ వాళ్ళు గర్వం గా చెప్పుకునే థియేటర్లలో ఒకటైన సత్యగౌరి. అన్నట్టు ఇక్కడ బ్లాక్ టికెట్ల గొడవుండదు. ఇంక సౌండ్ సిస్టం అంటారా? కేకో కేక. మా ఊరోళ్ళుఅందరూ ముక్త కంఠం తో చెప్పే మాట "సత్య గౌరీ" మెయిన్టైన్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు అని. అంత బావుంటుంది ఈ థియేటర్. ఇక్కడ క్యాంటీన్ లో సేమ్య ఉప్మా, పూరి భలే ఉంటాయిలెండి. భట్టి విక్రమార్క 1960, సీతా రామ కల్యాణం 1961 సినిమాలు ఇక్కడ శత దినోత్సవాలు జరుపుకున్నాయి. చాలా పెద్ద థియేటర్. త్వరగా హౌస్ ఫుల్ అవదు. సవతి కొడుకు (22-02-1963) తర్వాత ఈ థియేటర్ లో కేవలం ఇంగ్లీషు సినిమాలు వేసేవారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1973 లో దేవుడు చేసిన మనుషులు శత దినోత్సవం జరుపుకోవడం ఒక చరిత్ర. అక్కడినుండీ మళ్ళీ తెలుగు సినిమాలు వేస్తున్నారు.
ఇంకా ముందుకు సంత చెరువు దాటి వస్తే కుడి చేతి వైపు ఒక థియేటర్ కనిపిస్తోంది కదా. ఆ థియేటర్ పేరు మెజిస్టిక్ థియేటర్. ఇక్కడ ఒక నాటక సమాజం కూడా ఉండేది.యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని. ఆ నాటక సమాజం నుంచే సినీ పరిశ్రమకు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. అబ్బే పెద్ద పేరున్న వాళ్ళు కాదు లెండి. ఏదో ఎస్వీ రంగారావు, అంజలీదేవి లాంటి వాళ్ళన్నమాట. పల్లెటూరి పిల్ల 1950, జయ సింహ 1955, ఆడ పడచు 1967, కధా నాయకుడు 1969, అన్నదమ్ముల అనుబంధం 1974, సర్దార్ పాపారాయుడు 1980 సినిమాలు ఇక్కడ శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ మూతబడినట్లే.
పదండి ఆ పక్కనే ఇంకో థియేటర్ కనిపిస్తోంది కదా అది మొదట్లో మినర్వా టాకీసు. ఇప్పుడు పేరు మార్చి "మయూరి" అంటున్నారు. ఆడ బ్రతుకు 1965 లో శత దినోత్సవం జరుపుకుంది. అక్కినేని సినిమాలు వచ్చేవి ఇందులో. పూల రంగడు, మంచికుటుంబం ఇందులోనే 100 రోజులాడాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలు వేస్తున్నారు.
ఇంకాస్త ముందుకేల్తే "పద్మనాభ థియేటర్". పరమానందయ్య శిస్ష్యుల కధ 1966, ఎదురు లేని మనిషి 1975 ఇందులోనే 100 రోజులాడాయి. ఇప్పుడు పద్మనాభా ఫంక్షన్ హాల్ గా మారిందనుకుంటాను.
ఆ ఎడం చేతి వైపు ఒక పెద్ద పెట్రోల్ బంక్ కనిపిస్తోందా? దాని ప్లేస్ లో మా చిన్నప్పుడు రెండు థియేటర్ లు ఉండేవి. క్రౌన్, విజయ్ అని. అవి మొదటి తరం థియేటర్ల కోటాలోకి వస్తాయి. అన్నట్టు ఇందాకా చూసిన మెజిస్టిక్ కూడా ఆ బాపతే.
క్రౌన్ టాకీసులోనే 1950 పాతాళ భైరవి, 1952 పెళ్ళి చేసి చూడు, 1957 మాయా బజార్, 1960 శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, 1961 జగదేక వీరుని కధ, 1962 గుండమ్మ కధ, 1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం, 1963 బంధిపోటు, 1964 రాముడు భీముడు, 1965 నాదీ ఆడ జన్మే, 1968 రాము, 1982 బొబ్బిలి పులి సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ లేదు.
ఆ పక్కన విజై టాకీసు ఉండేది. 1965 పాండవ వనవాసం , 1965 దేవత , 1970 ధర్మదాత, 1971 దసరా బుల్లోడు సినిమాలు విజై టాకీసులో శతదినోత్సవ చిత్రాలు.
ఇంకాస్త ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పెద్ద రోడ్ కనిపిస్తోందా? అది దేవి, శ్రీదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్ అన్నమాట. మొదట్లో ఈ కాంప్లెక్స్ లో దేవి, శ్రీదేవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు దేవి స్క్రీన్ 1, 2, 3 అంటున్నారు. 1975 ఎదురు లేని మనిషి, 1976 ఆరాధన, 1977 అడవి రాముడు, 1977 ఎదురీత, 1977 యమగోల మొదలైన సినిమాలు ఇందులో 100 రోజులు పైన ఆడాయి.
కొంచెం ముందుకు వస్తే ఉడిపి హొటెల్. మున్సిపల్ ఆఫీస్ సెంటర్. ఆ కుడిచేతి పక్కన ఉండేది మా అభిమాన థియేటర్ కల్పనాటాకీసు. ఇప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ మాత్రమే ఉన్నా కల్పనా సెంటర్ అనే పిలుస్తున్నారు. 1966 లో శాంతారాం స్త్రీ సినిమాతో ఈ థియేటర్ మొదలయ్యింది. స్క్రీన్ పైకి వెళ్ళడం, కుర్చీలు అర్ధ వృత్తాకారంలో ఉండటం అప్పట్లో గొప్పగా చెప్పుకునే వారు. 1966 శ్రీ కృష్ణ పాండవీయం, 1966 శ్రీ కృష్ణ తులాభారం, 1967 ఉమ్మడి కుటుంబం, 1970 తల్లా పెళ్ళామా, 1970 కోడలు దిద్దిన కాపురం, 1971 శ్రీ కృష్ణ సత్య , 1973 దేశోద్ధారకులు, 1977 దాన వీర శూర కర్ణ, 1979 డ్రైవర్ రాముడు, 1983 నా దేశం, 1984 శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కల్పనా టాకీసులో శత దినోత్సవాలు జరుపుకున్నాయి.
అదిగో ఆ కుడి చేతి వైపు కనబడేదే మున్సిపల్ ఆఫీసు. ఆ రోడ్డు కనబడుతోంది చూసారా? తిన్నగా వెళ్తే సాంబమూర్తి నగర్ మీదుగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. అదిగో ఆ ఎడం చేతి వైపు చూడండి అదే "సూర్య కళా మందిర్ అనబడే సరస్వతీ గాన సభ". ఆంధ్రప్రదేశ్ లో సంగీత విద్వాంసులు, నటులు ఇలా కళాకారులందరూ ఈ వేదిక మీద ఒక్కసారైనా ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత పేరుంది దీనికి. ఆ పక్కనే వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారిపోయింది అనుకోండి. వెంకటేస్వరాలో 1963 నర్తనశాల, 1964 మూగ మనసులు, 100 రోజులు పైనే ఆడాయి.
దాని పక్కనే పెద్ద బిల్డింగ్ కనిపిస్తోందా? అవే చాణక్య, చంద్ర గుప్త థియేటర్లు. 1992 లో మేజర్ చంద్ర కాంత్ 100 రోజులాడింది ఈ థియేటర్లో.
ఇక్కడితో ఈ వీధిలో సినిమా హాళ్ళు అయిపోయాయి. మరి రోడ్డింకా ఉంది కదా అంటారా? తిన్నగా వెళ్తే ఆనందభారతి, కొత్తపేట మార్కెట్ దగ్గర రైల్వే గేటు, ఋట్ఛ్ కాంప్లేక్స్ వస్తాయన్నమాట. అవి దాటి కొంచం ముందుకి వెళ్లి ఎడం చేతి వైపు తిరిగితే భానుగుడి సెంటర్లో కలుస్తారు.
ఇదే భానుగుడి సెంటర్ కుడి చేతి వైపు పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్ల కాంప్లెక్స్. 1979 వేటగాడు, 1981 కొండవీటి సింహం, 1982 జస్టిస్ చౌదరి ఇందులోనే 100 రోజులు పైగా ఆడాయి.
ఇక్కడనుంచీ మనం టూ టౌన్ వంతెన మీదుగా మెయిన్ రోడ్ కి వెళతే అదిగో ఆ ఎడం చేతి వైపు కనిపిస్తోంది కదా అదే ఆనంద్ కాంప్లెక్స్. కాకినాడలో ముప్పాతిక మంది కాలేజి స్టూడెంట్స్ ఆస్థాన థియేటర్ కాంప్లెక్స్ ఇది. లోపల ఆనంద్, అంజని, గీత్, సంగీత్ అని నాల్గు థియేటర్లు ఉన్నాయి. 1980 సర్కస్ రాముడు ఇందులో 60 రోజులాడిన తర్వాత లక్ష్మీ టాకీసు కి షిఫ్ట్ చేసారు.
ఇక్కడనుంచీ అదిగో ఆ ఓవర్ బ్రిడ్జి కనబడుతోంది కదా దాని మీదుగా వెళ్తే టూ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్ కి వచ్చేసాం. అదిగో అది విజయలక్ష్మి హాస్పిటల్. కొంచం ముందుకి వెళ్తే ఆ ఎడం చేతి వైపు కనిపించేదే టౌన్ హాల్ దాన్ని దాటేస్తే నెక్స్ట్ సెంటర్లో హెడ్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ ఓ సారి ఆగి అల్లదిగో ఆ కుడిచేతి వైపు చూడండి అది తిరుమల థియేటర్. ఈ పోస్ట్ ఆఫీస్ పక్క వీధిలో వెళ్ళిపోతే మళ్ళీ దేవి శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి పోతారన్నమాట.
ఇవి కాక జగన్నాధపురం లో చంద్రిక, తూరంగి సూర్య మహల్ (ఇప్పుడు రాఘవేంద్ర అని పేరు మార్చినట్టు ఉన్నారు), విద్యుత్ నగర్ కమల్ - వీర్ (ఇవి రెండు థియేటర్లు), వాకలపూడి సూర్య మహల్ ఇవీ ఉన్నాయి.
అదండీ. మొత్తం మీద మా కాకినాడలో సినిమా హాల్స్.
మా చిన్నప్పుడు బాల్యంలో, స్కూల్, కాలేజీ రోజులలో (1958-1975) వెంకటేశ్వరా, కల్పనా, విజై, క్రౌన్, మినర్వా, మెజస్టిక్, పద్మనాభ, సత్య గౌరీ, లక్ష్మీ, పేలస్ , స్వప్నా టాకీసులు మాకు గుర్తున్న థియేటర్లు. ఆ తరువాత దేవి కాంప్లెక్స్, చాణక్య చంద్ర గుప్త, ఆనంద్ కాంప్లెక్స్, పద్మ ప్రియ కాంప్లెక్స్, తిరుమల టాకీసు, చంద్ర్క, వీర్ కమల్ థియేటర్లు వచ్చాయి. వెంకటేస్వరా, కల్పనా, విజై, క్రౌన్, మెజస్టిక్, పద్మనాభాలు , పేలస్ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలలో మిగిలాయి.
Note to ANR Favorites:- కాకినాడలో 1958-2013 మధ్యన అక్కినేని 47 సినిమాలు (out of his 231 Telugu movies, i.e. 20% or 1 in 5) శత దినోత్సవాలు జరుపుకున్నాయి. థియేటర్ పేర్లు గుర్తు లేవు.
1948 బాల రాజు, 1949 కీలు గుర్రం, 1950 పల్లెటూరి పిల్ల (మెజిస్టిక్), 1953 దేవదాసు, 1955 అర్ధాంగి, 1955 రోజులు మారాయి, 1955 సంతానం, 1956 భలే రాముడు, 1956 ఇలవేలుపు, 1957 మాయా బజార్ (క్రౌన్), 1957 సువర్ణ సుందరి, 1958 చెంచు లక్ష్మి, 1959 మాంగల్య బలం, 1959 ఇల్లరికం, 1960 శాంతి నివాసం, 1960 పెళ్ళి కానుక, 1961 వెలుగు నీడలు, 1961 భార్యా భర్తలు, 1961 ఇద్దరు మిత్రులు, 1962 ఆరాధన, 1962 మంచి మనసులు, 1962 గుండమ్మ కధ (క్రౌన్), 1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం (క్రౌన్), 1964 మూగ మనసులు (వేంకటేశ్వర), 1964 అమరశిల్పి జక్కన (మినర్వ్వా), 1966 అస్థిపరులు (విజై), 1967 పూల రంగడు (మినర్వా), 1968 మంచి కుటుంబం (మినర్వా), 1969 మూగ నోము (మినర్వా), 1969 ఆత్మీయులు (మినర్వా), 1970 ధర్మదాత (విజై), 1971 దసరా బుల్లోడు (విజై), ప్రేమ నగర్ (మినర్వా), 1972 కొడుకు కోడలు, 1973 బంగారు బాబు, 1976 సెక్రెటరి, 1977 బంగారు బొమ్మలు, 1978 చిలిపి కృష్ణుడు, 1978 రామ కృష్ణులు, 1980 ఏడంతస్థుల మేడ, 1981 శీవారి ముచ్చట్లు, 1981 ప్రేమాభిషేఖం, 1983 బహుదూరపు బాటసారి, 1983 శ్రీరంగ నీతులు, 1984 అనుబంధం, 1989 సూత్రధాpalleToorరులు, 1991 సీతారామయ్యగారి మనవరాలు,
Note to NTR Favorites:- కాకినాడలో 1950-1992 మధ్యన ఎన్ టి ఆర్ 58 సినిమాలు (out of his 280 Telugu movies, i.e 21% or 1 in 5) శత దినోత్సవాలు జరుపుకున్నాయి.
1950 పల్లెటూరి పిల్ల, 1951 పాతాళ భైరవి, 1952 పెళ్ళి చేసి చూడు, 1954 అగ్గి రాముడు, 1955 జయసింహ, 1956 జయం మనదే, 1957 మాయా బజార్, 1957 పాండురంగ మహాత్మ్యం, 1958 మంచి మనసుకు మంచి రోజులు, 1960 శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, 1960 భట్టి విక్రమార్క, 1961 జగదేక వీరుని కధ, 1962 గుండమ్మ కధ, 1962 రక్త సంబంధం, 1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం, 1963 లవకుశ, 1963 నర్తనశాల, 1963 బంధిపోటు, 1964 రాముడు భీముడు, 1965 నాదీ ఆడ జన్మే, 1965 పాండవ వనవాసం, 1965 తోడు నీడ (92 రోజులు), 1965 దేవత, 1965 వీరాభిమన్యు, 1965 ఆడ బ్రతుకు, 1966 శ్రీ కృష్ణ పాండవీయం, 1966 శ్రీ కృష్ణ తులాభారం, 1966 పరమానందయ్య శిష్యుల కధ, 1967 ఉమ్మడి కుటుంబం, 1967 ఆడ పడచు, 1968 రాము, 1969 కధా నాయకుడు, 1970 తల్లా పెళ్ళామా, 1970 కోడలు దిద్దిన కాపురం, 1971 శ్రీ కృష్ణ సత్య, 1973 దేశోద్ధారకులు, 1973 దేవుడు చేసిన మనుషులు, 1974 అన్నదమ్ముల అనుబంధం, 1975 ఎదురు లేని మనిషి, 1976 ఆరాధన, 1977 దాన వీర శూర కర్ణ, 1977 అడవి రాముడు, 1977 ఎదురీత, 1977 యమ గోల, 1978 యుగ పురుషుడు, 1979 డ్రైవర్ రాముడు, 1980 సర్దార్ పాపారాయుడు, 1980 సర్కస్ రాముడు, 1981 గజ దొంగ, 1981 కొండవీటి సింహం, 1982 జస్టిస్ చౌదరి, 1982 బొబ్బిలి పులి, 1983 నా దేశం, 1983 శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర, 1992 మేజర్ చంద్రకాంత్.