25/12/2024
రమణ మహర్షి జయంతి.
ఈరోజు శ్రీ రమణ మహర్షి జయంతి
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy